Friday, January 27, 2012

పెదవి మరక

                                                                         పెదవి మరక 

భూమ్మీద ఇంకా అందాలేవైనా మిగిలున్నాయా లేక అన్నిటికి పెళ్ళిళ్ళు అయిపోయాయా ? ఎందుకోసం ఎదురు చూస్తున్నామన్న విషయాన్ని కొన్ని క్షణాలు మడత పెట్టగలిగితే....ఎదురుచూపులో  ప్రేమ ఉండటం కన్నా అవసరం ఉండటమే నయమనిపిస్తుంది....న్యాయమనీ అనిపిస్తుంది. 

నా ఈ ఆలోచనకి జబ్బు చేసిందని ఇట్టే గుర్తించవచ్చు....ఎందుకంటే ఇది నా విసుగు నుంచి పుట్టింది గనక. బస్స్టాపులో నిలబడి గడియారం గుర్తుచేసిన చిరాకు వల్ల రాబోయే బస్సుని తిట్టుకుంటూనైనా ప్రేమిస్తుంది కదా నా ' ఖాళీగా ఉండటం ఇష్టం లేని మనసు'.  

అయినా నేను ఎదురు చూసేది నాకు ఏమవుతుందని ప్రేమించాల్లె !! బస్సు ఎలాగూ వస్తుందనుకో. 
ఆ కొండలూ    పక్షులూ.... మా గోదావరి....ఇంకా ఒక చేదు సంవత్సరపు ముహూర్తం నుంచి ఆ అమ్మాయీ... ఏమి కావు నాకు. అవేమీ నిరంతరం జ్వలించే విలువ కలిగి లేవా ?? ఉన్నాయేమో !! నాకు సొంతం కావు కాబట్టి నా మనసే ఇష్టపడటం లేదేమో. 

కాని ఆ అయిష్టతని జీవితానికి అతికించలేక కావాలని గుర్తు చేసుకుని మళ్లీ ఇంకోసారి మర్చిపోయేవరకు ప్రేమిస్తాను. 

అసలు ఏం కావాలి నాకు......అవ్వా ?? బువ్వా ?? అమ్మాయి నవ్వా ??  

అన్నీ !!!

కుదరదు....వీలుపడదు... డబ్బా మొత్తం నీకే ఇచ్చేస్తే ఎలా ? అంటాడు గావును దేవుడు. 
మళ్లీ దణ్ణం పెట్టడానికి ఇబ్బంది పడతానని అనుకుంటాడో ఏమో....పంచుకున్న ఎంగిళ్ళ రుచులన్నీ త్యాగం చేసి.... డబ్బా మిగుళ్ళతో సరిపెట్టుకోగలిగే మొండితనాన్నిచ్చి...ఇదిగో ఇలా బస్స్టాపులో నిలబెడతాడు.

అంతా బాగానే ఉంది. మరెప్పటికి తెలుసుకుంటాడు......... 

విప్పి విసిరి పారేయలేని అవసరాల చుట్టూ నా ఆలోచనలున్నాయనీ.....అన్నిటి మీదా నాకు ప్రేమలున్నాయని......
పని మీద బయటికెళ్ళేటప్పుడు పారేసుకుంటానని.......తిరిగి ఇంటికొచ్చేటప్పుడు  ఏరుకుంటానని.......
రాత్రంతా ఏకాంతంతో రమించే రెండు కన్నీటి బొట్ల వెచ్చదనానికి గభాల్న లేచి చెంప తడుముకుంటానని....
ప్రతి సారీ తగులుతుందని.......

ఎప్పటికీ ఉతకబుద్ధి కాని అదే ' పెదవి మరక' ని.

                                                                                                                                                 

Wednesday, January 4, 2012

మిగిలినవి 'గిన్నె' లో చదవండి.  

Tuesday, November 1, 2011

నా  కౌగిలి  కొనగోటికి  చిక్కుపడిన  ఆ  నెమలి  కన్నుల  పైటంచు
తన  సువర్ణ  వర్ణ  పూర్ణ  కుంభాలను కనులార  ఆరగించమని  కోరినా
పైట  తో  పాటు  జారిన  సిగ్గు 
నీ ఎడమ  చేతిని  అడ్డు  పెట్టి
ఆ నక్షత్ర  కాంతిని  నాదాకా రానీయలేదు...... :(

Thursday, October 13, 2011

నన్ను  కట్టేసేవి నా ప్రేయసి చేతులైతే.....జీవిత ఖైదుకు నేను సిద్ధం.